అసలు విషయం బయటపెట్టిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఇంద్ర(Indra). బి.గోపాల్ తెరెక్కించిన ఇంద్ర అప్పట్లో సంచలన విజయం సాధించింది. సుప్రసిద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తే.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా కూడా చిరంజీవి ఓ వీడియో బైట్ రిలీజ్ చేయడం జరిగింది. అంతే కాకుండా.. ఇంద్ర టీమ్ ను ఇంటికి పిలిపించుకుని ఇంద్ర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. చిరంజీవి, బాలయ్య.. నువ్వా.. నేనా..? అన్నట్టుగా పోటీపడేవారు. బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు సినిమాలు పోటీపడడం.. ఇద్దరి సినిమాలు సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఒక్కొక్కసారి చిరు విజయం సాధిస్తే మరోసారి బాలయ్య విజయం సాధించేవారు. అయితే.. చిరంజీవి ఇంద్ర సినిమా చేస్తున్న టైమ్ లో బాలయ్య సమరసింహారెడ్డి అనే ఫ్యాక్షన్ సినిమా చేసారు కాబట్టి చిరంజీవి కూడా ఇంద్ర అనే ఫ్యాక్షన్ సినిమా చేశారని టాక్ అప్పట్లో వినిపించేది. ఇప్పుడు చిరంజీవి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమరసింహా రెడ్డి సినిమానే. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని ఒక కోరిక ఉంది. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు అన్నారు మెగాస్టార్.