దిగ్గజ నటుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హరికృష్ణ కొడుకు జానకీరామ్ పెద్ద కుమారుడు ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేయబోతున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఆయన రేయ్ సినిమా తర్వాత పదేళ్ల విరామం అనంతరం చేస్తున్న చిత్రమిది. వైవీఎస్ చౌదరి భార్య యలమంచిలి గీత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వివరాలను ఈ రోజు ప్రెస్ మీట్ లో వివరించారు వైవీఎస్ చౌదరి.
ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వైవీఎస్ చౌదరి. అమెరికా నుంచి ఆయన మిత్రులు కొందరు ప్రొడక్షన్ లో భాగమవుతున్నారు. ఇప్పటిదాకా తాను పలువురు కొత్త వారిని పరిచయం చేశానని, ఎన్టీఆర్ కూడా యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని వైవీఎస్ చౌదరి అన్నారు. ఎన్టీఆర్ ను పరిచయం చేసేందుకు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారా, వాళ్లకు కథ చెప్పారా అనే ప్రశ్నలకు ప్రెస్ మీట్ లో అసహనం వ్యక్తం చేశారు వైవీఎస్ చౌదరి.