రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్..?

బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఓ చరిత్ర. ఆయన నాటి నంచి నేటి వరకు ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉన్నారు. ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే.. అమితాబ్ నట వారసుడుగా అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చాడు కానీ.. కెరీర్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో కొనసాగలేదు. ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ.. కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే.. ఇప్పుడు సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ బచ్చన్ ఇప్పుడు రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడట.

త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు సీనీరాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు బరిలోకి దిగిన ఆయన లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణ పై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అభిషేక్ తల్లి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, అభిషేక్‌ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు అనుకుంటున్నారట. మరి.. సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ రాజకీయాల్లో రాణిస్తాడేమో చూడాలి.