రివ్యూ – సత్యభామ

నటీనటులు – కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ, నేహా పఠాన్, అంకిత్ కొయ్య, ప్రజ్వల్ యడ్మ, సంపద ఎన్, అనిరుధ్ పవిత్రన్, సత్య ప్రదీప్తి, పవన్ కల్యాణ్ కొడాటి

టెక్నికల్ టీమ్ – స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి, సినిమాటోగ్రఫీ – బి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల

స్టార్ హీరోయిన్స్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ లో కనిపించడం ఇటీవల తగ్గిపోయింది. ఈ జానర్ లో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించిన సత్యభామ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించి ప్రెజెంటర్ గా వ్యవహరించగా..డెబ్యూ డైరెక్టర్ సుమన్ చిక్కాల రూపొందించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సత్యభామ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

సత్యభామ (కాజల్ అగర్వాల్) హైదరాబాద్ లో ఏసీపీ. షీ టీమ్స్ వింగ్ లో పనిచేస్తుంటుంది. షీ సేఫ్ యాప్ మహిళలు ఉపయోగించేలా అవగాహన కల్పిస్తుంటుంది. ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అవసరాన్ని బట్టి ఆయుధాన్ని లేదా ఆలోచనను వాడుతుంటుంది. ఈ రెండింటినీ పవర్ ఫుల్ గా వాడగల సత్తా ఉన్న ఆఫీసర్. ఆమె భర్త అమరేందర్ (నవీన్ చంద్ర) ఒక ఫేమస్ రైటర్. భర్తతో స్పెండ్ చేసేంత టైమ్ కూడా సత్యభామకు ఉండదు. కేసులతో ఆమె బిజీగా వర్క్ చేస్తుంటుంది. హసీనా (నేహా పఠాన్) తన భర్త యెదు (అనిరుధ్ పవిత్రన్) హింసిస్తున్నాడంటూ సత్యభామకు కంప్లైంట్ ఇస్తుంది. యెదుకు ఫోన్ లో వార్నింగ్ ఇచ్చి హసీనాకు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తుంది సత్యభామ. హసీనా తన సోదరుడు ఇక్బాల్ (ప్రజ్వల్ యడ్మ), ఇక్బాల్ ఫ్రెండ్ దివ్య (సంపద ఎన్)ను సత్యభామకు పరిచయం చేస్తుంది. హసీనా ఇంటికి వెళ్లగానే యెదు వచ్చి దారుణంగా కొట్టి హత్య చేస్తాడు. ఘటనా స్థలానికి చేరుకున్నా హసీనాను కాపాడలేకపోతుంది సత్యభామ. యెదును పట్టుకునే క్రమంలో అతని మీద కాల్పులు జరుపుతుంది. యెదు తప్పించుకుంటాడు. రెసిడెన్షియల్ ఏరియాలో కాల్పులు జరిపినందుకు సత్యభామను పై అధికారులు హెచ్చరిస్తారు. ఆమెను సస్పెండ్ నుంచి కాపాడుతాడు ఆఫీసర్ జోసెఫ్ (ప్రకాష్ రాజ్). చనిపోయే ముందు తన సోదరుడు ఇక్బాల్ ను జాగ్రత్తగా చూసుకోమంటూ సత్యభామను కోరుతుంది హసీనా. హసీనా ప్రాణాలు కాపాడలేకపోయినందుకు సత్యభామ వేదనకు గురవుతుంది. యెదును పట్టుకునేందుకు తన మిషన్ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో హసీనా సోదరుడు ఇక్బాల్ కూడా కిడ్నాప్ కు గురవుతాడు. దీంతో సత్యభామ షాక్ కు గురవుతుంది. ఆమె బాధ రెట్టింపు అవుతుంది. సత్యభామ హసీనా హత్య కేసు, ఇక్బాల్ కిడ్నాప్ కేసు ఛేదించేందుకు చేసే ఇన్వెస్టిగేషన్ లో ఎంపీ రమాకాంత్ రెడ్డి (రవి వర్మ) బంధువు, వీడియో గేమింగ్ కంపెనీ ఓనర్ రిషి రెడ్డి (అంకిత్ కొయ్య), ఇక్బాల్ స్నేహితురాలు దివ్య ప్రేమికులని తెలుస్తుంది. సత్యభామ యెదును ఎలా పట్టుకుంది, ఈ కేసులో నేహా, విజయ్, ఏసీపీ ఆనంద్ రావు (హర్షవర్థన్) పాత్ర ఏంటి, బాధితురాలు హసీనాకు సత్యభామ న్యాయం చేయగలిగిందా లేదా అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

సత్యభామ ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్. కథలో అనేక లేయర్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో వీటిని ఒకదానితో ఒకటి కలుపుతూ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు శశికిరణ్ తిక్క. కథలో అనేక పాత్రలు వస్తుంటాయి. వీడియో గేమింగ్ కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఈ వీడియో గేమింగ్ ద్వారా ఫాంటసీ వరల్డ్ ను క్రియేట్ చేసి కథనానికి కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు. సత్యభామ చూస్తున్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించిందీ ఎలిమెంట్. ఇంటర్ స్టెల్లర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ అయినా, వెయ్యి కోట్ల వసూళ్ల బాహుబలి అయినా ఎమోషనే కీ పాయింట్. సత్యభామ క్రైమ్ థ్రిల్లర్ అయినా ఎమోషన్ కీలకంగా ఉండేలా చూసుకున్నారు. దీంతో బిగినింగ్ సీన్ నుంచి ఈ సినిమాలో ప్రేక్షకులు లీనమవుతారు. స్క్రీన్ నుంచి పక్కకి చూడనంత ఎమోషనల్ బాండింగ్ కథతో ఏర్పడుతుంది.

హసీనా హత్యతో కథలో ఇంటెన్సిటీ పెరుతుంది. హసీనా కుటుంబం పట్ల సత్యభామ చూపించే సానుభూతి, వాళ్లకు సహాయం చేయాలనే ప్రయత్నాలు మనసుకు హత్తుకుంటాయి. ఇక్బాల్ కిడ్నాప్ తో సత్యభామ షాక్ కు గురవుతుంది. అతని కేసు ఇన్వెస్టిగేషన్ లో అనేక కొత్త క్యారెక్టర్స్ కథలోకి రావడం, వాటి నేపథ్యాలు వెతుక్కుంటూ సత్యభామ ట్రావెల్ చేయడం వంటి అంశాలు క్యూరియాసిటీ పెంచుతాయి. యాక్షన్ సీక్వెన్సులు కథలో అవసరాన్ని బట్టి పెట్టడం వల్ల యాక్షన్ ఎక్కడా ఆర్టిఫిషియల్ గా అనిపించదు. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ ను కొడుతుంది అనే ఫీలింగే కలుగుతుంది. కాజల్ ఎమోషనల్ గా ఎంత బాగా పర్ ఫార్మ్ చేసిందో యాక్షన్ సీక్వెన్సుల్లోనూ అంతే న్యాచురల్ గా ఆకట్టుకుంది. ఓల్డ్ సిటీలో విలన్స్ కొట్టి బయటకు వచ్చే ఎలివేషన్ సీన్…ఆ సీన్ కు శ్రీచరణ్ పాకాల డిజైన్ చేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది.

హసీనా పాత్రలో నేహా పఠాన్ నటన ఆకట్టుకుంది. ఇక్బాల్ గా నటించిన ప్రజ్వల్ యడ్మ, యెదు క్యారెక్టర్ లో క్రూరంగా కనిపించిన అనిరుధ్ పవిత్రన్…ఇలా ప్రతి క్యారెక్టర్ అందంగా మలిచిన ఈ కథలో బాగా కుదిరాయి. ఎడిటర్ పవన్ కల్యాణ్ కొదాటి, సత్య ప్రదీప్తి సత్యభామకు హెల్ప్ చేసే క్యారెక్టర్స్ లో మెప్పించారు. టెక్నికల్ గా ఆర్ట్ వర్క్ ను స్పెషల్ మెన్షన్ చేయాలి. ప్రతి ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దింది ఆర్ట్ వర్క్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ వంటి మేజర్ విభాగాలు ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చాయి. కొత్త దర్శకుడు సుమన్ చిక్కాలకు గుడ్ బిగినింగ్ ఇచ్చే చిత్రమిది. ప్రొడక్షన్ పరంగా అవురమ్ ఆర్ట్స్ తమకున్న రిసోర్సెస్ లో హై క్వాలిటీ మేకింగ్ చూపించారు. సత్యభామ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా.

రేటింగ్ 3.5/5