నెల రోజుల గ్యాప్ లో 4 మెగా సినిమాలు

మెగా అభిమానులకు జులై 28 నుంచి పండగ స్టార్ట్ అవుతుంది. ఈ పండగా ఒక రోజు రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజులు పాటు ఉండబోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. మెగా హీరోల నుంచి వరుసగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అవును.. ఇది నిజంగా నిజం. ఇంతకీ ఆ నాలుగు సినిమాలు ఏంటంటే.. జులై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో రూపొందుతోన్న బ్రో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు.

ఇక బ్రో సినిమా రిలీజైన రెండు వారాలకు మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన వారానికి అంటే.. ఆగష్టు 18న వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజైన వారానికి వరుణ్ తేజ్ గాంఢీవధార అర్జున చిత్రం రిలీజ్ కానుంది. ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఇలా నెల రోజుల గ్యాప్ లో మెగా హీరోల నుంచి నాలుగు సినిమాలు వస్తుండడం విశేషం.