దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కు జీనియస్ డైరెక్టర్ గా పేరుంది. ఆయన ఘజినీ సినిమా తమిళ, తెలుగుతో పాటు హిందీలోనూ ఘనవిజయం సాధించింది. ఈ క్రేజ్ తో మురుగదాస్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమా చేశారు. విజయ్ కాంత్ హీరోగా ఈ దర్శకుడు తమిళంలో రూపొందించిన రమణ సినిమా సూపర్ హిట్టయ్యి…ఆ సినిమా తెలుగు రీమేక్ ఠాగూర్ లో చిరంజీవి హీరోగా నటించారు. ఠాగూర్ చిరంజీవికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మురుగదాస్ మరోసారి చిరంజీవితో సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
అప్పటికున్న క్రేజ్ ప్రకారం చూస్తే స్టాలిన్ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. అయినా దర్శకుడు మురుగదాస్ తో చిరంజీవి రిలేషన్ కు ఏ ఇబ్బందీ కలగలేదు. వీలైనప్పుడు మళ్లీ సినిమా చేయాలనే వీరిద్దరు అనుకున్నారు. ఇది ఇప్పటికి కుదిరినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం తనను మరోసారి తెరపై వైవిధ్యంగా చూపించగల దర్శకుల కోసం వెతుకుతున్నారు. ఆ క్రమంలోనే వీరి ప్రాజెక్ట్ చర్చల్లోకి వచ్చింది. చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.