హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే తన ఇన్ స్టా ఖాతాలో ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్స్ సలహాలు నెటిజన్లతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందులు వేసుకోవడం కంటే.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత సిఫార్సు చేసింది. అలాగే తనకు ఆ సలహా ఇచ్చిన వైద్యుడిని కూడా ట్యాహ్ చేసింది. అయితే సమంత చేసిన పోస్టుపై డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా ది లివర్ డాక్ తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ది తక్కువ పని ఇంకొకటి ఉండదని.. అలా చేయడం వల్ల ప్రాణాలు పోతాయని.. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అన్నారు. ఆరోగ్యం పట్ల సమంతకు ఏం తెలియదని..ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైల్లో పెట్టాలని కామెంట్ చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యింది సామ్. తనను జైల్లో పెట్టాలని వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ మాటలకు వివరణ ఇస్తూ సుధీర్ఘ నోట్ షేర్ చేసింది.
“గత రెండేళ్లుగా నేను నా ఆరోగ్యం దృష్ట్యా అనేక రకాల ఔషదాలను తీసుకోవాల్సి వచ్చింది. నేను తీసుకోవాలని సూచించిన ప్రతిదానిని నేను ముందే ప్రయత్నించాను. పేరున్న నిపుణుల పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినవి మాత్రమే నేను ట్రై చేశాను. ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి కూడా. వాటిని నేను భరించగలిగాను. ఇంతటి ఖర్చు భరించలేని వారి గురించి మాత్రమే నేను ఆలోచిస్తుంటాను. సంప్రదాయ చికిత్సలు నా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లేదు. కానీ ఇవి ఇతరులకు పనిచేసి ఉంటాయని నేను నమ్ముతున్నాను. చికిత్స విధానాన్ని గట్టిగా వాదించేంత అమాయకురాలిని మాత్రం కాదు. గత రెండు సంవత్సరాలలో నేను ఎదుర్కొన్న, నేర్చుకున్న వాటిని మంచి ఉద్ధేశ్యంతోనే సూచిస్తున్నాను. ముఖ్యంగా చికిత్సలన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే. కాబట్టి వాటిని అందరూ ప్రయత్నించకపోవచ్చు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేయడానికి మనమందరం విద్యావంతులైన వైద్యులపై ఆధారపడతాము. ఈ చికిత్స గురించి నాకు చెప్పిన డాక్టర్ కూడా మంచి పేరు వ్యక్తే.
ఆయన 25 ఏళ్లుగా DRDOలో సేవలందించిన ఒక ఉన్నతమైన డాక్టర్. ఒక పెద్ద మనిషి నా పోస్ట్ పై, నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. అతడు కూడా వైద్యుడే. నాకంటే అతడికి ఎక్కువ తెలుసు అనడంలో సందేహం లేదు. కానీ నా గురించి మాట్లాడిన అతడి ఉద్దేశాలు గొప్పవని నాకు తెలుసు. అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల గౌరవాన్ని పెంచేది. ముఖ్యంగా నన్ను జైలులో వేయాలని అంటున్నారు. పర్వాలేదు. నేను సెలబ్రెటీ అనే కోణంలో ఆయన అన్నారేమో. నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వారికి సహాయం చేసే ఒక వ్యక్తిగా పోస్ట్ చేశాను. నేను చేసిన పోస్ట్ డబ్బు కోసం మాత్రం కాదు. ఇదే చేయండి అని నేను ఆమోదించడం కూడా లేదు. సంప్రదాయ ఔషదం పనిచేయనివారు మరోదారిని వెతుకుతారు. అలాంటి వారి కోసమే నేను ఆ చికిత్స సూచించాను. లివర్ డాక్ తనను టార్గెట్ చేయడం కంటే నాకు సూచించిన డాక్టర్ తో ఇదే చర్చ జరిపి ఉండే బాగుండేది. నేను ట్యాగ్ చేసిన డాక్టర్ ను మర్వాదపూర్వకంగా ఆహ్వానించి చర్చ జరిపితే బాగుంటుంది. ఇద్దరు అర్హత కలిగిన నిపుణుల మధ్య చర్చ జరిగితే నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నేను నా ఆరోగ్యానికి ఉపయోగపడిన చికిత్సల గురించి ఇతరులతో పంచుకుంటున్నాను. కానీ ఎవరికీ హానీ కలిగించడానికి కాదు. నేను కూడా ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాను. ఆయుర్వేదం, హోమియోపి, ఆక్యుపంక్చర్, టిబెటన్, మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ వంటి వాటిని సూచిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నేను వారి సలహా మాత్రమే పాటిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది సామ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.