ఎదగడం అంటే మెట్టుకు మెట్టూ ఎక్కడమే. అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు చెర్రీ. మొన్న మొన్నటిదాకా ఆయన పేరు ముందున్న మెగాపవర్‌స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కి న్యాయం చేయాలని ఫిక్సయ్యారు రామ్‌చరణ్. దానికి తగ్గట్టే అడుగులేస్తున్నారు.
రచ్చ సినిమా టైటిల్ సాంగ్‌ని నరనరాన ఎక్కించేసుకున్నట్టున్నారు రామ్‌చరణ్. ఆయన ప్రతి అడుగునూ జాగ్రత్తగా గమనిస్తున్న వారు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య ఆయన అడుగేస్తే ఆంధ్రా సీడెడ్ నైజామ్ మాత్రమే రచ్చ కనిపించేది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ ఆ రచ్చ గ్లోబల్ స్థాయిలో స్ప్రెడ్ అవుతోంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత తాను గెస్ట్ రోల్ చేసిన ఆచార్య పెద్దగా ఆడకపోయినా పట్టించుకోలేదు చెర్రీ. పర్సనల్‌గా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, గేమ్‌చేంజర్ కేరక్టర్‌కి తగ్గట్టు మేకోవర్ అవుతూ, పాపతోనూ, ఫ్యామిలీ మెంబర్స్ తోనూ పర్సనల్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తూ గడిపారు.
ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్చేంజర్లోనూ ఆయన పోర్షన్ కంప్లీట్ అయింది. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో త్వరలోనే చెర్రీ మైనపు విగ్రహాన్ని చూడబోతున్నాం. ఆల్రెడీ బ్యాంకాక్‌లో ప్రభాస్‌కీ, సింగపూర్‌లో మహేష్‌కీ, దుబాయ్‌లో బన్నీకి ఈ విగ్రహాలున్నాయి. లండన్‌లో ఆ ప్రతిష్టను సొంతం చేసుకుంటున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు చరణ్.
ఆగస్టు 15 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవానికి గౌరవ అతిథిగా వెళ్లనున్నారు చెర్రీ. అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డును అందుకుంటున్న తొలి ఇండియన్ సెలబ్రిటీ మా హీరోనే అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక సెప్టెంబర్‌లో సరికొత్త మేకోవర్‌తో బుచ్చిబాబు సెట్లో అడుగుపెడతారు చెర్రీ.