కన్నడ హీరో రక్షిత్ శెట్టి పై ఓ సంస్థ కాపీ రైట్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ అంగీకారం లేకుండానే తన సినిమాలో రెండు పాటలను వాడుకున్నారని MRT ఆడియో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు చేసింది. దీంతో తన పై వచ్చిన ఆరోపణలపై రక్షిత్ శెట్టి స్పందిస్తూ ఈ విషయాన్ని కోర్టులోనే సెటిల్ చేస్తానని అన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. రక్షిత్ శెట్టి నిర్మించిన బ్యాచిలర్స్ పార్టీ సినిమా కొన్ని వారాల క్రితం విడుదలైంది. అయితే ఇందులో సందర్భానుసారంగా ”న్యాయ ఎల్లీడు..’, ‘గాలిమాతు..’ పాటలను ఈ చిత్రంలో ఉపయోగించారు. అయితే ఈ సాంగ్స్ హక్కులను కలిగి ఉన్న MRT సంస్థ రక్షిత్ శెట్టితోపాటు అతని నిర్మాణ సంస్థపై కోర్టులో కాపీరైట్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది. ఇదే కేసుకు సంబంధించి రక్షిత్ శెట్టి ఇప్పుడు బెంగుళూరులోని సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
‘బ్యాచిలర్స్ పార్టీ’ సినిమాలో ”న్యాయ ఎల్లీడు..’, ‘గాలిమాతు..’ పాటలను చిన్న బిట్స్ మాత్రమే ఉపయోగించారు. నిజానికి, సినిమాలో ఈ పాటలను ఉపయోగించే ముందు, రక్షిత్ శెట్టి పాటల హక్కులను కలిగి ఉన్న MRTని కలుసుకుని అనుమతి కోరారని.. అయితే తమ పాటలను ఉపయోగించేందుకు MRT భారీ మొత్తాన్ని అడిగారని.. దీంతో రక్షిత్ శెట్టి తమ అనుమతి లేకుండానే పాటను ఉపయోగించారని సమాచారం. కానీ ఆ తర్వాత సదరు సంస్థ రక్షిత్ శెట్టిపై కాపీ రైట్ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి నిర్మాత రక్షిత్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్‌ఐఆర్ నమోదైన అనంతరం రక్షిత్ శెట్టికి చెందిన పరమావహ్ స్టూడియో ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ కేసును కోర్టులోనే ఎదుర్కొంటామని చెప్పాం. ఇకపై ఎవరూ ఇలా ప్రవర్తించకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.
రక్షిత్ శెట్టి ప్రస్తుతం ‘రిచర్డ్ ఆంటోని’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘రిచర్డ్ ఆంటోనీ’ చిత్రానికి రక్షిత్ శెట్టి దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ‘ఉలిదవారు కందంటే’ సినిమాలోని రిచర్డ్ క్యారెక్టర్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.