మేం రికార్డుల కోసం సినిమాలు తీయలేదు. ఆడియన్స్ మనసులు గెలుచుకోవడానికే సినిమాలు చేశామని చెప్పారు కల్కి మేకర్స్. అయితే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాక రికార్డులు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి.?
తెలుగువారు తీసిన ఈ సినిమా తెలుగు రికార్డులతో సరిపెట్టుకోవడం లేదు. హిందీ మార్కెట్లో ఆల్రెడీ మనవారు సుస్థిరం చేసుకున్న స్థానం మీదే ఫోకస్ పెంచింది. బాలీవుడ్లో తారక్, చెర్రీని సైడ్ ఇవ్వమంటూ హారన్ మోగిస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.
సాహోరే బాహుబలి అంటూ ఇప్పటికీ హిందీ మార్కెట్లో నెంబర్ వన్ కలెక్షన్లున్న సినిమాగా బాహుబలి2నే గౌరవిస్తున్నారు. ఆ నెక్స్ట్ ప్లేస్ నాదేనండీ అంటూ సైలెంట్‌గా కేజీయఫ్2తో ఖర్చీఫ్ వేసేశారు ప్రశాంత్ నీల్.
మూడో ప్లేస్‌లో ఒద్దికగా ఉంది ట్రిపుల్ ఆర్. 275 కోట్లు వసూలు చేసి టాప్3లో ఉన్నామన్నారు తారక్ అండ్ చెర్రీ. ఇప్పుడు వారి నాటు స్టెప్పులను బీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు డార్లింగ్.
హారన్ మోత మోగిస్తూ సైడ్ ఇవ్వమంటూ చెలరేగిపోతున్నారు. హిందీలో ఆల్రెడీ కల్కి సినిమా 265 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ వారాంతం కలెక్షన్లు తోడయితే ఆ ఫిగర్‌ని క్రాస్ చేయడం పెద్ద పనేం కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్.
డార్లింగ్ ప్రభాస్‌కి సౌత్‌లో ఎంత చరిష్మా ఉందో, అంతకు మించిన ఇమేజ్ నార్త్ లోనూ ఉందని ప్రూవ్ చేసింది సాహో మూవీ. ఇప్పుడు కల్కి సినిమాకు హిందీలో వస్తున్న కలెక్షన్లు చూసి 'మా వాడు గ్రేటెహే' అని మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
అభిమానులు ప్రభాస్‌ని దేవుడిలా చూస్తారంటూ రీసెంట్గా అమితాబ్ చెప్పిన మాటలను కూడా పనిలో పనిగా వైరల్ చేస్తున్నారు రెబల్ సైనికులు.