మూవీ రివ్యూ: పేకమేడలు
నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హరిచరణ్ కే
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీతం: స్మరణ్
నిర్మాత: రాకేష్ వర్రే
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: నీలగిరి మామిళ్ళ
తెలుగు, తమిళంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన నటుడు వినోద్ కిషన్. ఈయన ఇప్పుడు హీరోగా పేకమేడలు అనే సినిమా చేసాడు. పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నీలగిరి మామిళ్ళ. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది..? సినిమాలో ఆకట్టుకునేదేంటి.. బోర్ కొట్టించేదేంటి.. పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
లక్ష్మణ్ (వినోద్ కిషన్) ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. వచ్చే పది పరకతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అతడికి భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ), కొడుకు టింకూ ఉంటారు. డబ్బులు లేకపోయినా కూడా బాగా రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కలలు కంటుంటాడు లక్ష్మణ్. దానికోసం భార్యను కూడా ఇబ్బంది పెడుతుంటాడు. బి టెక్ చదివావు కాబట్టి ఒక జాబ్ చేయమని.. నెలకు జీతం వచ్చే జాబ్ అయితే బాగుంటుందని.. పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించమని చాలా సార్లు చెప్తుంది వరాలు. కానీ లక్ష్మణ్ అవేం బుర్రకెక్కించుకోడు. ఇదే సమయంలో బాగా డబ్బున్న ఎన్నారై శ్వేత (రితిక శ్రీనివాస్) హైదరాబాద్‌కు వస్తుంది. ఆమెతో లక్ష్మణ్‌కు ఓ ఫ్లాట్ విషయంలో పరిచయం ఏర్పడుతుంది. అక్కడ్నుంచి శ్వేతను ట్రాప్ చేస్తాడు లక్ష్మణ్. తన బిజినెస్ కోసం ఆమెను వాడుకుంటాడు. ఈ విషయం భార్య వరాలుకు తెలిసి.. భర్త ఇంక మారడని పుట్టింటికి వెళ్లిపోతుంది. అక్కడ పెద్దలతో పంచాయితీ చేస్తారు. అయినా కూడా లక్ష్మణ్‌లో ఏ మార్పు రాదు.. కొన్నాళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చేస్తుంది వరాలు. తనకు వచ్చిన వంటతో ఓ చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మణ్‌లో మరో కోణం బయటికి వస్తుంది.. అప్పుడేమైంది..? అసలు లక్ష్మణ్ మారాడా లేదా అనేది అసలు కథ..
కథనం:
కట్టుకున్న వాడు పట్టించుకోకపోతే.. భార్యే కుటుంబాన్ని పోషించే కథలు గతంలోనూ చాలా వచ్చాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నపుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ నటించిన ఆవిడే శ్యామల గుర్తుకొస్తుంది. ఆ సినిమా లైన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. గాల్లో మేడలు కట్టే భర్త.. అతడి అండ లేకుండా ఎదగాలనుకునే భార్య.. ఇదే లైన్‌తో పేకమేడలు కథ కూడా ముందుకు వెళ్తుంది. అయితే మిగిలిన సినిమాల్లో చివర్లో భార్యా భర్తలు కలిసిపోవడం.. అతడిలో మార్పు రావడం లాంటివి చూపిస్తుంటారు. కానీ ఈ పేకమేడలు సినిమాలో మాత్రం రియలిస్టిక్ అప్రోచ్‌తో వెళ్లాడు దర్శకుడు నీలగిరి మామిళ్ళ. మధ్య మధ్యలో శ్రీ రామచంద్రులు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఛాయలు కూడా కనిపిస్తుంటాయి. ఫస్టాఫ్ అంతా సినిమా నెమ్మదిగా వెళ్తుంది. లక్ష్మణ్.. అతని కుటుంబ నేపథ్యం.. డబ్బు కోసం లక్ష్మణ్ వేసే వెధవ వేశాల మీదే వెళ్తుంది. ఇంటర్వెల్ కూడా సింపుల్‌గానే వస్తుంది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. లక్ష్మణ్ గురించి భార్యకు తెలియడం.. ఆ తర్వాత ఆమె తీసుకునే నిర్ణయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. బస్తీ కథ కావడంతో చాలా న్యాచురల్‌గా ఈ కథను తెరకెక్కించారు దర్శకుడు నీలగిరి. మెయిన్ ప్లాట్ కూడా చాలా బాగుంది.. కథ మనకు అర్థం అవుతున్నా కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. ప్రీ క్లైమాక్స్‌లో భార్య భర్తల మధ్య వచ్చే గొడవ సీన్ మాత్రం మరో ఎత్తు. సినిమాలో మెయిన్ హైలైట్ సీక్వెన్స్ ఇదే. అక్కడున్నది ఎవరో తెలియకపోయినా విజిల్స్ కూడా పడ్డాయి థియేటర్స్‌లో. ఆడవాళ్లు ఎంత బలంగా ఉంటారు.. కష్టాల్లో ఎంత బలంగా కుటుంబం కోసం నిలబడతారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు దర్శకుడు.
నటీనటులు:
వినోద్ కిషన్ తన వరకు బాగా నటించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ చాలా న్యాచురల్‌గా కనిపించాడు. సినిమాకు ప్రాణం మాత్రం అనూషా కృష్ణ. ఈమె నటన సినిమా స్థాయిని మార్చేసింది. ప్రతీ సీన్ చాలా బాగా నటించింది ఈ అమ్మాయి. ప్రతీ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఎంతో అద్భుతంగా ఇచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్లో నటించింది. రితిక శ్రీనివాస్ ఉన్నంత వరకు బాగానే చేసారు. మిగిలిన నటులంతా దాదాపు కొత్త వాళ్లే. వాళ్ళ వాళ్ల పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
పాటలు బాగున్నాయి. ముఖ్యంగా లక్ష్మణ్ కారెక్టరైజేషన్ గురించి వచ్చే లచ్చన్న పాట ఆకట్టుకుంటుంది. సినిమాకు స్మరణ్ సంగీతం బాగానే హెల్ప్ అయింది. హరిచరణ్ సినిమాటోగ్రఫీ ఓకే.. విజువల్స్ ఆకట్టుకుంటాయి. లొకేషన్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. కథ పాతదే అయినా కూడా కథనం కొత్తగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా న్యాచురల్‌గా తీసాడు దర్శకుడు నీలగిరి. అక్కడే ఆయనకు దర్శకుడిగా మంచి మార్కులు పడ్డాయి. నటుడు రాకేష్ వర్రే నిర్మాతగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టాడు. థియేటర్స్ వరకు ఈ సినిమా ప్రేక్షకులను రప్పిస్తుందో లేదో తెలియదు కానీ ఓటిటిలో మాత్రం అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా పేకమేడలు.. ఓకే అనిపించే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!