మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలపరంగా కాకుండా ఆయన వ్యక్తిత్వానికే కోట్లాది మంది అభిమానులున్నారు. పవన్ కు సంబంధించిన ఏ చిన్న విషయమైన క్షణాల్లో నెట్టింట వైరలవుతుంది. ఇన్నాళ్లు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో అలరించిన పవన్.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గబ్బర్ సింగ్ ఒకటి. ఇందులో పవన్ యాక్టింగ్, మేనరిజం, డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా అంటే అదే. మండుటెండలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. “నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. ” అంటూ పవన్ కచెప్పిన డైలాగ్స్ తో థియేటర్లు షేక్ అయ్యాయి.
ఈ సినిమా 2012 మే 11న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. అలీ, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలు పోషించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదట. కానీ తప్పని పరిస్థితుల్లో తన అన్నయ్య నాగబాబు అప్పులు తీర్చేందుకు ఈ సినిమాను చేయాల్సి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ సినిమాను రీమేక్ చేయాలని చిత్రయూనిట్ తనకు ఆ సినిమా విడుదలైన రెండు, మూడు నెలలకు చూపించారని.. అప్పుడు చూస్తే తనకు ఆ మూవీ ఏం అర్థం కాలేదని అన్నారు. “సల్మాన్ ఖాన్ నటించిన ఆ కథలో కొత్తగా ఏముంది.. సల్మాన్ పర్సనల్ మూవీలా ఉంది. తల్లి, కొడుకు కథే ఉంది కదా.. కొత్తదనం ఏముంది.. ? అనిపించింది. అందుకే చేయలేనని చెప్పాను. కానీ కొన్ని రోజులకు నాగబాబు అన్నయ్య ఏదో సినిమాకు సంబంధించి ఫైనాన్షియల్ సమస్యలు ఉంటే ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను. వెంటనే సినిమా స్టార్ట్ చేసి అప్పు తీర్చాలి అనుకున్నాను. అప్పుడు తక్కువ బడ్జెట్ లో తొందరగా కంప్లీట్ అయ్యే సినిమా గురించి ఆలోచించి గబ్బర్ సింగ్ మూవీ చేశాను” అని అన్నారు.
అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ కూడా అలాంటి కారణంగానే చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. హరి హర వీరమల్లుతోపాటు.. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.