విడుదల తేదీ : జూలై 26, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: రక్షిత్, సంగీర్తన విపిన్, చరణ్ రాజ్, రాధిక, టివి5 మూర్తి తదితరులు
దర్శకులు: వెంకట సత్య
నిర్మాతలు : ధ్యాన్ అట్లూరి
సంగీత దర్శకుడు: శ్రావణ్ వాసుదేవ్
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్ : సత్య గిడుతూరి
సంబంధిత లింక్స్: ట్రైలర్
పలాస మూవీ ఫేమ్ రక్షిత్ హీరోగా వెంకట్ సత్య డైరెక్షన్ లోనే వచ్చిన సినిమా ఆపరేషన్ రావణ్. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రామ్ (రక్షిత్ అట్లూరి) టీవీ 45 అనే ఓ న్యూస్ ఛానల్ కి వారసుడు. ఐతే, రామ్ తన ఛానల్ లోనే ఓ ఎంప్లాయ్ గా జాయిన్ అవుతాడు. అదే ఛానల్ లో పనిచేస్తున్న ఆమని (సంగీర్తన)ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా రామ్ ప్రేమలో పడుతుంది. ఈ మధ్యలో నగరంలో పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలను ఓ సైకో కిల్లర్ అపహరించి హత్య చేస్తుంటాడు . అతన్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఉంటుంది. మరోవైపు ఆమని(సంగీర్తన ) కూడా రామ్ సహాయంతో ఆ కేసును విచారణ చేస్తుంటుంది. మరి వీరి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ?, ఇంతకీ సైకో కిల్లర్ ఎవరు ?, ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తుంటాడు ?, ఫైనల్ గా అతన్ని ఎలా పట్టుకున్నారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
సైకో కిల్లర్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే న్యూస్ ఛానెల్ కి సంబంధించిన సీన్స్ వంటి అంశాలు సినిమాలో బాగానే ఉన్నాయి. ఇక హీరోగా రక్షిత్ అట్లూరి చక్కని నటనను కనబరిచాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకు రక్షిత్ అట్లూరి పూర్తి న్యాయం చేశాడు. అలాగే, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగీర్తన విపిన్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. కొన్ని ప్రేమ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ సన్నివేశంలో కూడా ఆమె నటన బాగుంది.
అలాగే చరణ్ రాజ్, రాధిక, టివి5 మూర్తి లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అన్నట్టు ఓ వ్యక్తి సీరియల్ కిల్లర్ గా, సైకోగా ఎందుకు మారాడు ? అనే పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
జర్నలిస్ట్ పాత్రలో రక్షిత్ అట్లూరి మెప్పించినా.. మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నా.. కథ నేపథ్యంతో పాటు ఆసక్తి లేకుండా సాగే సన్నివేశాలు మరియు డిపార్ట్ మెంట్ పట్ల కనీస అవగాహన లేకుండా రాసుకున్న సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. సహజంగా సీరియల్ కిల్లర్, సైకో తరహా సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటేనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కానీ, ఈ సినిమాలో ఆ స్పీడ్ మిస్ అయ్యింది.
అదేవిధంగా సైకో కిల్లర్ నెక్ట్స్ ఎవరిని చంపుతాడా ? అనే ఉత్కంఠను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అలాగే, హీరోయిన్ కిడ్నాప్ వ్యవహారంలో నడిచే డ్రామా, ఇక ఏసిపిని చంపే సన్నివేశం వంటి ఎలిమెంట్స్ లో లాజిక్ ను మిస్ కాకుండా చూసుకోవాల్సింది. రాధికా శరత్ కుమార్ ఎమోషనల్ గా ప్రేక్షకులని మెప్పించినా.. ఆమె పాత్ర గ్రాఫ్ మాత్రం తేలిపోయింది. మొత్తానికి దర్శకుడు సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ కంటే కూడా.. పండని కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు వెంకట సత్య ఐడియా బాగున్నా, తన ఐడియాకి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ అంశాలు జోడిస్తేనే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని ఆయన వదిలేశారు. నాని చమిడిశెట్టి అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. శ్రావణ్ వాసుదేవ్ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత ధ్యాన్ అట్లూరి నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘ఆపరేషన్ రావణ్’ అంటూ వచ్చిన ఈ సీరియస్ సైకో క్రైమ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. అయితే ప్లే ఆసక్తికరంగా లేకపోవడం, కామెడీ అండ్ క్రైమ్ సీన్స్ ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, అలాగే, కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా మెప్పించలేకపోయింది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team