మనకు ఈ చిన్న చిన్నవి వర్కవుట్ అవ్వవు.. కొడితే ఒకటే జాక్‌పాట్.. కుంభస్థలం బద్ధలైపోవాలంతే అంటున్నారు నిఖిల్. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకు ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది.. ఇమేజ్ కూడా బానే ఉంది. కానీ ఇది సరిపోదంటున్నారీయన. అందుకే ప్లాన్ మార్చారు. అది గానీ వర్కవుట్ అయితే.. దెబ్బకు పాన్ ఇండియన్ స్టార్ అయిపోతారు నిఖిల్.
హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. నిఖిల్‌కు హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం స్వామి రారా సినిమానే. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఆ సినిమాతోనే సోలో హీరోగా మార్కెట్ తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ 2 లాంటి సినిమాలతో నిఖిల్ జర్నీ ఎదురులేకుండా సాగుతుంది.
కార్తికేయ 2 తర్వాత నిఖిల్ రేంజ్ మరింత పెరిగింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీలోనూ రప్ఫాడించింది కార్తికేయ 2. ఈ నమ్మకంతోనే ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు నిఖిల్. అందులో ఒకటి స్వయంభు కాగా.. మరోటి ది ఇండియా హౌజ్.
ఇండియా హౌజ్ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యే షూటింగ్ మొదలైంది. సయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్. అలాగే స్వయంభు షూటింగ్ చాలా రోజులుగా జరుగుతుంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇది ఒకటి కాదు.. రెండు భాగాలుగా రాబోతుందని. భారీ బడ్జెట్‌తోనే వస్తుంది స్వయంభు.
నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తుంది స్వయంభు. ఈ కథ రాసుకున్నపుడే దర్శకుడు ఏకంగా నాలుగు భాగాలు చేయాలనుకున్నట్లు తెలుస్తుంది. కాకపోతే అంత వర్కవుట్ అవ్వదు కాబట్టి 2 భాగాలతో సరిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి స్వయంభు, ఇండియన్ హౌజ్ సినిమాలతో తన మార్కెట్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు నిఖిల్.