ప్రస్తుతం సౌత్ సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను ఏలేస్తున్నాయి. బాహుబలి మూవీ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో దక్షిణాది చిత్రాల క్రేజ్ మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా ప్రాంతీయ చిత్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలను ఇతర భాష సినీ ప్రియులు ఆదరిస్తున్నారు. దీంతో ఇటు సౌత్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కల్కి చిత్రంలో అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కీలకపాత్రలు పోషించగా.. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో బీటౌన్ హీరో ఇమ్రాన్ హాష్మీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. వీరే కాకుండా సౌత్ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి. ఇప్పటికే వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
అలాగే మరిన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సౌత్ మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదని.. నటనపై ఇష్టంతోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు. రామన్ రాఘవన్ వంటి సినిమాలు చేసినప్పుడు తనకు ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్, ఆలోచనలపై పూర్తిగా పట్టు ఉంటుందని.. కానీ దక్షిణాది చిత్రాల్లోకి వచ్చేసరికి ఆ పట్టు కచ్చితంగా అలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేకపోతున్నానని అన్నారు.
సౌత్ సినిమాల్లో తనకు మంచి పారితోషికం ఇస్తున్నారని.. దీంతో డబ్బు ఎక్కువగా ఇవ్వడంతో ఆయా పాత్రలలో నటిస్తున్నానని అన్నారు. కానీ షూటింగ్ కు ముందు ఎవరో ఒకరు ఆ పాత్రకు, సన్నివేశానికి సంబంధించి వివరణ ఇస్తున్నారని.. ఏ డైలాగ్స్ చెప్పాలనే విషయాన్ని ఎవరో ఒకరు చెప్తున్నారని.. కొన్నిసార్లు అక్కడేం జరుగుతుందనేది తనకు అర్థం కావడంలేదని అన్నారు. ఏదో యాడ్ షూటింగ్ కు వచ్చినట్లుగా కానిచ్చేస్తున్నానని.. డబ్బులిస్తున్నారు.. నటిస్తున్నాను.. అంతే అన్నట్లుగా ఉంటుంది.. కానీ ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ పెంచుకోవడం లేదు.. ఆ విషయంలో మాత్రం సిగ్గుపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నటించిన రౌతు కా రాజ్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.