తెలుగు తెరపై ఎంతో మంది హాస్యనటులు తమదైన నటనతో సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించారు. కామెడీ పంచులు, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను అలరించారు. వందలాది చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటనతో ప్రేక్షకుల పెదాలపైకి నవ్వులు తెప్పించిన కమెడియన్లలో కల్పనా రాయ్. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో అప్పట్లో ఎన్నో గుర్తిండిపోయే పాత్రలతో మెప్పించింది. దాదాపు 430కు పైగా సినిమాల్లో నటించింది. జంబలకిడి పంబ, ప్రేమించచుకుందాం రా, కలిసుందం రా వంటి చిత్రాల్లో నటించింది. వందల సినిమాలు చేసి సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కల్పనా రాయ్.. చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడింది. కూతురు మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక వేదన అనుభవించింది. చివరకు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయింది.
కల్పనా రాయ్.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. 1950లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు సత్యవతి. యుక్తవయసులో ఎంతో అందంగా ఉండేది. ఒంటినిండా బంగారు నగలు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే రెండు కళ్లు చాలేవి కాదట. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నీడలేని ఆడది సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నవ్వించడం.. సెట్ లో అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేది. కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేసేది. కానీ ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. ఆస్తి తగ్గగానే అందరూ దూరమయ్యారు. పెళ్లి చేసుకుండా ఒంటరిగా ఉన్న కల్పనా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ఓ అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది.
కూతురు వెళ్లిపోవడం.. డబ్బు ఆవిరి కావడంతో ఆమెను పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. చనిపోయేముందు పది రోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించింది. ఎందరికో తన చేతులతో వండి కడుపునింపిన కల్పనా రాయ్ ఆకలికి తట్టుకోలేక ధీన స్థితిలో కన్నుమూసింది. ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితికు చేరుకుంది. అంతటి కష్టం ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు చేశారని గతంలో నటి జయ శ్రీ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.