500 కోట్లు.. ఒకప్పుడు ఇంత కలెక్షన్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్లు మన హీరోలు. కేవలం బాలీవుడ్లో మాత్రమే అప్పుడప్పుడూ ఈ ఫిగర్ కనిపించేది. కానీ ఇప్పుడలా కదు.. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి దక్షిణాదిన ఎవరి ఖాతాలో ఎన్ని 500 క్రోర్స్ మూవీస్ ఉన్నాయో చూద్దామా..?
మార్కెట్ పెరిగినపుడు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతుంటాయి. బాహుబలి నుంచి తెలుగు సినిమాల జాతకం మారిపోయింది. తాజాగా కల్కి దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. అందరి ఊహలకు మించి వసూలు చేస్తుంది కల్కి. కేవలం 5 రోజుల్లోనే 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్రభాస్ కెరీర్లో 4వ 500 కోట్ల సినిమా ఇది. ముందు సినిమా సలార్ కూడా 500 కోట్లు వసూలు చేసింది.
మిగిలిన హీరోలు 500 కోట్లు వసూలు చేయడానికి నానా తంటాలు పడుతుంటే.. ప్రభాస్ మాత్రం ప్రతీ సినిమాతోనూ దాన్ని కొల్లగొడుతున్నారు. కల్కి దూకుడు చూస్తుంటే 800 కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. గతేడాది వచ్చిన సలార్ 650 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు బాహుబలి 2 1800 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
సౌత్ ఇండియాలో ప్రభాస్ ఒక్కడే 4 సార్లు 500కోట్లు దాటారు. ఈయన తర్వాతి స్థానంలో రజినీకాంత్ ఉన్నారు. ఈయన నటించిన 2.0, జైలర్ సినిమాలు 500 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసాయి. శంకర్ 2.0 దాదాపు 750 కోట్లు వసూలు చేస్తే.. జైలర్ 600 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్, రజినీ తర్వాత సోలోగా ఈ రికార్డ్ అందుకున్న హీరో విజయ్ మాత్రమే. గతేడాది లియో సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నారు దళపతి. ఈ చిత్రం దాదాపు 560 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం RRRతో 500 కోట్లు దాటారు. ఈ సినిమా ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. అలాగే యశ్ కూడా కేజియఫ్ 2తో ఈ రికార్డ్ సొంతం చేసుకున్నారు.