ఈ మధ్య కథ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ.. కాంట్రవర్సీ లేని పెద్ద సినిమాలు మాత్రం రావట్లేదు. తాజాగా కల్కి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇది రిలీజైన రోజు నుంచే ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాస్త పెద్ద వివాదమే ఈ సినిమా మెడకు చుట్టుకుంది. ఏకంగా లీగల్ నోటీసులు కూడా అందాయి. మరి కల్కిని ఈ వివాదం ఎటువైపు తీసుకెళ్ళనుంది..?
కల్కి సినిమాతో బాహుబలి 2 తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్బులో చోటు సంపాదించుకున్నారు ప్రభాస్. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంటా బయటా రప్ఫాడిస్తుంది కల్కి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపిక, అమితాబ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రంపై వివాదం రేగింది.
కల్కి సినిమాను మహా భారతంలోని కొన్ని సన్నివేశాల ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదే ఇప్పుడు వివాదానికి చోటిస్తుంది. నిజానికి కల్కి విడుదలైనప్పటి నుంచి కూడా పురాణాలను వక్రీకరించి కర్ణుడిని హీరో చేస్తున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది. తాజాగా కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ నుంచి కల్కి చిత్రయూనిట్‌కు లీగల్ నోటీసులు అందాయి.
మన పురాణాల్లో ఉన్న వాటికి కల్కి విరుద్ధంగా ఉంది.. ఈ సినిమా మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది.. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం.. చిత్ర యూనిట్ సమాధానం కోసం వేచి చూస్తున్నాం.. కల్కి భగవాన్ కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని.. అది పురాణాలని అగౌరపరచడమే అంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్.
హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌తో సహా చిత్ర నిర్మాతలకు కూడా లీగల్ నోటీసులు అందాయి. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని.. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించారని చూపించడం దారుణం అన్నారాయన. మొత్తానికి ఈ వివాదానికి కల్కి టీం ఎలాంటి సమాధానమిస్తుందో చూడాలిక.