విడుదల తేదీ : సెప్టెంబర్ 21, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : సుహాస్, పోసాని కృష్ణమురళి, రఘు తదితరులు.
దర్శకుడు : పురాణం బాబీ
నిర్మాత : ప్రవీణ్‌రెడ్డి
సంగీత దర్శకుడు : పవన్ సి.హెచ్
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
బ్యానర్ : ఫోకల్ వెంచర్స్
సంబంధిత లింక్స్: ట్రైలర్
సుహాస్, పోసాని కృష్ణమురళి, రఘు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గొర్రె పురాణం. ఫోకల్ వెంచర్స్ బ్యానర్‌పై ప్రవీణ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. కాగా ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రవి (సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళ్తాడు. మరోవైపు ఓ గొర్రె దూరంగా ఉన్న ఊరిని చూసి అక్కడికి వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఒక ముస్లిం వ్యక్తి ఆ గొర్రెను జుబా చేయడం కోసం కొనుగోలు చేస్తాడు. తనను చంపుతున్నారని తెలిశాక, ఆ గొర్రె పారిపోతుంది. ఆ గొర్రెను పట్టుకునే క్రమంలో ముస్లింలకు, హిందువులకు మధ్య గొడవ జరుగుతుంది. అసలు ఆ గొర్రె కోసం ముస్లింలు, హిందువులు ఎందుకు గొడవ పడ్డారు ?, ఆ గొర్రె మీద ఎలాంటి పంచాయతీ జరిగింది ?, ఎలాంటి కేసులు పడ్డాయి ?, మీడియా ఆ గొర్రెను ఎందుకు హైలైట్ చేసింది ?, ఇంతకీ.. రవి ఎందుకు హత్య చేశాడు ?, చివరకు ఆ గొర్రె కథ ఎలా మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
గొర్రె పురాణం అంటూ సాగిన ఈ గొర్రె కథలో ఒకటి రెండు చోట్ల కామెడీ ఓకే అనిపిస్తోంది. ఐతే, సమాజంలో కొన్ని సీరియస్ విషయాలను వ్యంగ్యంగా చెప్పాలని దర్శకుడు ఓ ప్రయత్నం ఐతే చేశాడు. ఈ క్రమంలో మీడియా మీద, రాజకీయ నాయకుల మీద సెటైర్లు కూడా బాగానే వేశారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సుహాస్ కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. పోసాని కృష్ణమురళి, రఘు మరియు మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ గొర్రె పురాణం సినిమా మెయిన్ పాయింట్ లో ఉన్న మ్యాటర్ కూడా.. సినిమాలో లేదు. దర్శకుడు బాబీ తాను తీసుకున్న పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ గొర్రె పురాణం సినిమాలో అది పూర్తిగా మిస్ అయింది.
అటు సుహాస్ పాత్రతో సహా మిగిలిన పాత్రలను డిజైన్ చేసుకోవడంలో కూడా దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు. ప్రేక్షకులను థ్రిల్ చేయాలని రాసుకున్న సీన్స్ లో కూడా కన్ ఫ్యూజనే ఎక్కువ సాగింది. పోనీ, ఎమోషనల్ గా అయినా కథను కనెక్ట్ చేశాడా ? అంటే అదీ లేదు. ఈ మధ్యలో సుహాస్ పాత్ర ఎందుకు మర్డర్ చేసింది ? అనేది కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు.
కథ గొర్రె చుట్టే తిరుగుతుంది కానీ, గొర్రె పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడా ఆకట్టుకునే డ్రామా లేదు. గొర్రె నుంచి ఎలాగూ నటన ఎక్స్పెక్ట్ చేయలేం, అందుకే ఆ గొర్రెకు వాయిస్ ఓవర్ ఇప్పించారు. పోనీ ఆ వాయిస్ తోనైనా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్ట్ పెంచి ఉండి ఉంటే బాగుండేది. ఫైనల్లీ ఈ గొర్రె పురాణంలో ఇంట్రెస్ట్ తో పాటు లాజిక్స్ కూడా ఉండవు. పైగా సినిమాలో సిల్లీ ట్రాక్స్ కూడా మైనస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా బాగా నిరాశ పరిచింది.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ కూడా బాగాలేదు. కాకపోతే, పవన్ సి.హెచ్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రఫీ బాగాలేదు. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం బాగాలేదు. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాత ప్రవీణ్‌రెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఏవరేజ్ గా ఉన్నాయి. దర్శకుడు బాబీ ఉత్కంఠభరితమైన కథాకథనాలను రాసుకోలేదు.
తీర్పు :
‘గొర్రె పురాణం’ అంటూ వచ్చిన ఈ చిత్రం బాగా నిరాశ పరిచింది. ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా సాగడం, కథలో మేటర్ లేకపోవడం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలతో పాటు లాజిక్ లెస్ డ్రామా కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ ‘గొర్రె పురాణం’ ఏ కోణంలోనూ ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team