అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. తాజాగా ఈ హత్య కేసులో 200కి పైగా టెక్నికల్ ఆధారాలతో పాటు, ఫిజికల్ సాక్ష్యాల్ని సేకరించారు. ఆధారాలు కనుక నిజమైతే, దర్శన్ ఈ కేసులో పూర్తిస్థాయిలో కూరుకుపోయినట్టే. రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో ఎవరిపై సాఫ్ట్ కార్నర్ చూపే ప్రసక్తే లేదన్నారు హోంమంత్రి జి పరమేశ్వర. కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను వెల్లడిస్తూ.. త్వరలోనే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలను సేకరించి చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామన్నారు. మరోవైపు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్, మరోసారి కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంటిభోజనం, పడుకోవడానికి మంచం, చదువుకోవడానికి కొన్ని పుస్తకాల్ని జైలులోకి అనుమతించాలని కోర్టును అభ్యర్థించాడు. జైలు ఆహారం వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని డాక్టర్ రిపోర్టు చేశారు. కావున ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
జైలులో ఉన్నప్పటి నుంచి దర్శన్ శరీర బరువు బాగా తగ్గిపోతున్నాడు. ఈ కారణంగానే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇంటి నుంచి భోజనం, పరుపులు, పుస్తకాలు తెచ్చుకునేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. జస్టిస్ ఎస్.ఆర్.కృష్ణకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. ఈ కేసును ఇతర కేసుల మాదిరిగానే పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. ‘మీరు ఇంటి నుంచి భోజనం, మంచం, పుస్తకాలు తెచ్చుకోవాలని అభ్యర్థించారు. దీనిపై గతంలో కోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా? జైలు మాన్యువల్‌లో ఇంటి భోజనం గురించి నియమం ఉందా? మీరు జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయకుండా హైకోర్టులో దరఖాస్తు చేయవచ్చా? ఖైదీల చట్టం దీనిపై ఏం చెబుతోంది’ అని ప్రశ్నించారు. కాగా ఈ విషయంలో చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ కృష్ణకుమార్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత విచారణ జూలై 18కి వాయిదా పడింది.
ఆహారం, మంచం, పుస్తకాలు, బట్టలు, చెంచా ఇంటి నుంచే అందించాలని దర్శన్ కోర్టులో డిమాండ్ చేశారు. వీటన్నింటినీ ఇంటి నుంచి తీసుకెళ్లేందుకు జైలు అధికారులు అనుమతించలేదు. ఈ కారణంగానే దర్శన్ కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.