దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష.. ఇప్పుడు మరోసారి కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన త్రిష.. ఇప్పుడు తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. త్రిష ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ బృంద. సౌత్ క్వీన్‌గా ఎంతో మంది అభిమానులను గెలుచుకున్న త్రిష ఇప్పుడు బృంద అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న బృంద వెబ్ సిరీస్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.. ఈ సందర్భంగా ఆదివారం ‘బృంద’ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది త్రిష. అయితే ఆమెను తోటి అధికారులే చిన్నచూపు చూస్తుంటారు. సూటి పోటీ మాటలతో బాధ పెడుతుంటారు. ఓ కేసు విషయంలో ఆమెను సస్పెండ్ కూడా చేస్తారు. బృందా తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంది.. ? అసలు ఆ కేసుకు బృందాకు సంబంధం ఏంటీ.. ? చివరకు ఆ కేసును బృందా ఎలా సాల్వ్ చేసింది అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఓ సైకో హత్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. తన పనిచేసే చోట ఎదుర్కొనే అవమానాలను, సూటిపోటి మాటలను బృందా ధైర్యంగా ఎదుర్కొని పోరాడడం చూపించారు.
డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాల ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన బృందా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా.. ఆసక్తిగా సాగింది. మనుషులను బలి ఇవ్వడం.. హత్యలు, ఇన్వెస్టిగేషన్ లతో ఆద్యంతం మిస్టీరియస్ గా సాగింది. ఇక ఇందులో మరోసారి తన మార్క్ నటనతో మెప్పించింది త్రిష. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.