ఆశల్లేవని డాక్టర్లు చెప్పాక.. పేషెంట్ బతికి బయటపడితే ఎలా ఉంటుంది..? ఇప్పుడు కొందరు హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. దుకాణం బంద్.. ఇంక వీళ్ళ కెరీర్ ఖతమ్.. మూట ముల్లె సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినిపిస్తున్న సమయంలో వెబ్ సిరీస్‌లు వాళ్ల కెరీర్‌కు అండగా నిలుస్తున్నాయి. సినిమా చిన్నచూపు చూసినా.. డిజిటల్‌కు పెద్ద దిక్కులా మారిన ఆ ముద్దుగుమ్మలెవరు..?
ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోతే ఆ హీరోయిన్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్లే. కానీ ఇప్పుడలా కాదు.. సినిమాలు లేకపోయినా వాటిని మించిన వెబ్ సిరీస్‌లు వాళ్ల కెరీర్స్‌ను ఆదుకుంటున్నాయి. వెండితెరపై కాకపోయినా.. బుల్లితెరపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్‌ల కారణంగానే అంజలి కెరీర్ వెలిగిపోతుందిప్పుడు.
ఝాన్సీ, ఫాల్.. తాజాగా బహిష్కరణ అంటూ క్వీన్ ఆఫ్ డిజిటల్ అయిపోయారు ఈ రాజోలు సుందరి. సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తున్నా.. వెబ్ సిరీస్‌లు మాత్రం రెగ్యులర్‌గా చేస్తున్నారు అంజలి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు అంజలి. మొన్నీమధ్యే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ నటించారు. ఈ మధ్య సినిమాల్లో కనిపించని రెజీనా సైతం డిజిటల్‌పై ఫోకస్ చేసారు.
తెలుగు మాత్రమే కాదు.. హిందీ నుంచి కూడా రెజీనాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రాకేట్ బాయ్స్, ఫింగర్ ట్రిప్, షూర్వీర్, ఫర్జీ, జాన్బాజ్ హిందుస్తాన్ కే లాంటి వెబ్ సిరీస్‌లలో నటించారు రెజీనా. వీటికి వచ్చిన రెస్పాన్స్‌తో డిజిటల్ వైపే అడుగులేస్తున్నారు ఈ బ్యూటీ. నిత్యా మీనన్ కెరీర్‌కు కూడా వెబ్ సిరీస్‌లే హెల్ప్ అవుతున్నాయి.
ఆ మధ్య బ్రీత్ 1 అండ్ 2 సిరీస్‌లతో హిందీలో గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్.. తెలుగులో మోడ్రన్ లవ్ హైదరాబాద్, కుమారి శ్రీమతిల్లో నటించారు. కరోనా టైమ్‌లో రుద్రతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. గతేడాది రాజ్ డికే యాక్షన్ డ్రామా ఫర్జీతో మెప్పించారు. వీళ్ళే కాదు.. తమన్నా, కాజల్, సమంత, శృతి హాసన్ లాంటి స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.