దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. అది దాటనంత వరకు ఓకే గానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకు కంగారు ఖాయం. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు..? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు.. కానీ మిడ్ రేంజ్ హీరోలకు అలా కాదు..! వాళ్ళపై 40 కోట్లు పెట్టడానికి కూడా లెక్కలేస్తుంటారు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు.. 30 కోట్లున్న హీరోపై 60 కోట్లు పెడుతున్నారు. ఇది కచ్చితంగా రిస్క్ అని వాళ్లకూ తెలుసు.. ఇంకా చెప్పాలంటే చీకట్లో బాణవేయడమే. తగిలితే హ్యాపీనే.. కానీ మిస్సైతే చుక్కలే.
మిడ్ రేంజ్ సినిమాలు హిట్టైనపుడు లాభాలు భారీగానే ఉంటాయి. దానికి గీత గోవిందం, హనుమాన్ లాంటి సినిమాలే నిదర్శనం. హనుమాన్ ఏకంగా 125 కోట్ల లాభం తీసుకొస్తే.. గీత గోవిందం ఆరేళ్ళ కిందే 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. కానీ మార్కెట్‌ను మించి ఖర్చు పెడితే.. ఏజెంట్, శాకుంతలం, రావణాసుర లాంటి షాకులు కూడా తప్పవు.
బడ్జెట్ అనేది ఇప్పుడు మ్యాటరే కాదని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఎక్కడో ఓ చోట కంగారైతే ఉంటుంది కదా..! తాజాగా నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం బడ్జెట్ 70 కోట్ల దాటిందని తెలుస్తుంది. నాని ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండటంతో నిర్మాత దానయ్య కూడా నిశ్చింతగానే ఉన్నారు.
నాగ చైతన్య తండేల్ బడ్జెట్ 75 కోట్లు దాటిందని స్వయంగా బన్నీ వాస్ తెలిపారు. కార్తికేయ 2తో చందూ మొండేటికి పాన్ ఇండియన్ మార్కెట్ వచ్చింది కాబట్టి గీతా ఆర్ట్స్ 2 బడ్జెట్‌పై టెన్షన్ పడట్లేదు. ఇక సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంత మార్కెట్ ఉన్నా.. నిర్మాతలు బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవడం మంచిదేమో..!